లోకేష్ … వ్యక్తిగతం కాని వ్యక్తిత్వం

లోకేష్ ఇప్పటి యువకులు అందరిలాగే ఓ యువకుడు. బాగా పలకరిస్తారు. హాయిగా నవ్వుతారు. ఆప్యాయంగా షేక్‌హాండిస్తారు. రండి కాఫీ తాగి వెళ్ళండంటూ తెలుగింటి మర్యాద రుచి చూపిస్తారు. రోజులు మారాయి. రాజకీయాలు మారుతున్నాయి. కొత్తతరం నాయకులూ దూసుకొస్తున్నారు. అంటే కత్తులు దూసుకొస్తున్నారని కాదు. ఆ కక్షలిపుడు చెల్లవు. కత్తుల నిరంకుశ పాలనకివి రోజులు కావు. ప్రజల్లో మనిషిగానే, నీటిలో చేపగానే బతికే ప్రజాస్వామ్య పరిమళాల రోజులివి. 34 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద రాష్ర్టాన్ని గాడిలో పెట్టే పనిని తలకెత్తుకున్నారు లోకేష్. అది తండ్రి చంద్రబాబునాయుడికి చేయూతనివ్వడమే కావచ్చు. మన కొత్త రాష్ర్టానికి రాజధానిని నిర్మించడమే కావచ్చు. ఎలా చెప్పకొన్నా అది కొన్ని కోట్లమంది ప్రజల బతుకుల్ని బాగు చేయడమనే బృహత్తర బాధ్యత. మన కళ్ళముందే పెరిగిన లోకేష్ అనే ఈ యువకెరటం ఇంత ఆలోచన చేయగలరా? ఇంత భారాన్ని మోయగలరా? అనిపిస్తుంది ఎవరికైనా.

విద్యాధికుడు … నిత్య విద్యార్థి

మర్యాదగా, మన్ననగా, నీ రూమ్మేటులాగే వుండే లోకేష్_ఒక గొప్ప కుటుంబ జీవితాన్ని చూసిన అదృష్టవంతుడు. ఒక మహాపురుషుడు ఎన్టీరామారావుకి స్వయానా మనవడు. మరో మంచి నాయకుడు చంద్రబాబు నాయుడికి ఏకైక కుమారుడు. ఎన్టీఆర్ బిడ్డ, నందమూరి వారి ఆడపడుచు భువనేశ్వరీ దేవి పెంపకంలో కుదురుగా ఎదిగినవాడు. అంటే పొద్దున్న లేస్తే ఎన్టీఆర్ ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళెవరు? తెల్లారితే చంద్రబాబునాయుణ్ణి కలిసి, మాట్లాడి వెళ్ళేదెవరు? భువనేశ్వరి బంధువులంతా ఎవరు? ఇలా ఒక గొప్ప కుటుంబ, రాజకీయ, వ్యాపార అనుబంధాల మధ్య, నిత్యనూతనమైన ప్రజా సంబంధం మధ్య లోకేష్ ఎదగడమంటే, కాచి వడబోసిన అనుభవసారాన్ని దోసిళ్ళతో తాగిన సకల విద్యాపారంగతుడనే కదా! ఎన్టీయార్ ఈ రాష్ర్టాన్ని ఉత్తేజపరిచిన ముఖ్యమంత్రి మాత్రమే కాదు. వెండి తెర కృష్ణునిగా, రామునిగా, దుర్యోధనునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో సూపర్ స్టార్‌డమ్‌ కి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచినవాడు. తెలంగాణా, రాయలసీమ, కోస్తా అనే తేడా లేకుండా యావత్ తెలుగు జాతి హారతులందుకున్నవాడు. తండ్రి చంద్రబాబు తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ర్టాన్ని నలుగురూ మెచ్చేలా పరిపాలించినవాడు. మంచి పరిపాలన అంటే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా పరిపాలనా దక్షుడంటే ఒకే ఒక్క చంద్రబాబు నాయుడుగా అసలు సిసలైన కీర్తి గడించిన వాడు. వీళ్ళకి వారసుణ్ణి గదాని లోకేష్ దర్జాగా కాలమీదకాలేసుక్కూచోలేదు. చదువుమీద శ్రద్ధ పెట్టాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. కార్నెగీమిలన్ యూనివర్సిటీ నుంచి మేనేజిమెంట్ ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తెచ్చుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. ఎం.బి.ఎ. పాసయ్యాడు. ఆ తర్వాత 2007లో బ్రాహ్మణితో లోకేష్ వివాహం జరిగింది. బ్రాహ్మణి- మేనమామ నందమూరి బాలకృష్ణ బిడ్డ. ఇలా సినిమా, రాజకీయాలు వాళ్ళ జీవితాల్లో భాగం అయిపోయాయి. ఒకటి వినోదం, మరోటి సంక్షేమం- ఏదైనా జనం కోసమే. నువ్వెవరివో, నువ్వేమిటో నిర్ణయించేది నీ నేపథ్యమే. అంటే లోకేష్ సినీ పారిశ్రామికవేత్తల మనిషైనా కావాలి, ప్రజల మనిషన్నా కావాలి. రెండోదే కావాలనుకున్నాడు. అనగా కష్టాన్నే భుజానికెత్తుకున్నాడు. ప్రజాశ్రేణుల్ని పట్టించుకోవాలన్న ‘తాతయ్య కల’ని నిజం చేద్దామనే నిర్ణయించుకున్నాడు. దాని ఆచరణ కోసం నడుం బిగించాడు. నలుగురిలోనూ కలిసి ముందుకు నడుస్తున్నాడు. మేధావులలో మహానుభావులలో స్నేహాలూ, వ్యాపార సామ్రాజ్య విస్తరణలూ, సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేయడాలూ లోకేష్‌కి చాలా సాధారణమైన విషయాలు. నిజమైన ప్రజాసంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడగలగడమే అసాధారణమైన విషయం అని అతను గ్రహించినట్టే వున్నాడు. కుటుంబం నేర్పిన క్రమశిక్షణ, అహర్నివలూ కష్టపడి పనిచేయాలన్న తాత, తండ్రుల వారసత్వం లోకేష్‌ని బాధ్యత గుర్తెరిగిన పౌరునిగా తీర్చిదిద్దాయి. నాలుగు స్తంబాలు, నాలుగు దిక్కులు అన్నయ్యగా తెలుగుదేశం పార్టీ, నాన్న చంద్రబాబునాయుడు, అయిదుకోట్ల మంది ప్రజానీకం, ముందడుగువేయబోతున్న కొత్త రాష్ర్టం_గురుతరమైన ఈ నాలుగు బాధ్యతలూ లోకేష్‌ని చేతులుసాచి పిలిచాయి. కోటి ఆశలు నిన్ను కోరి రమ్మన్నాయి అన్నాడు మహాకవి. పేద ప్రజలే ఈ రాష్ర్టాననికున్న పెద్ద పెట్టుబడి, వాళ్ళ స్వేద బిందువులే ఆంధ్రదేశాన్ని ముందుకు నడిపించే కందెన.ఆ జనాన్ని కదిలించే వాడు, చేతనం నింపేవాడు నేటి తక్షణావసరం. ఆ అత్యవసరాన్ని సద్వినియోగం చేయాలన్న ఆలోచనే లోకేష్‌ని కొత్తతరం నాయకుణ్ణి చేసింది.

కార్పోరేట్ విజేత

నవలోకానికి తలుపులు తెరిచేది ఆధునిక టెక్నాలజి. ఉన్నత పాలనా ప్రమాణాలు నెలకొల్పడంలో టెక్నాలజీని వినియోగించి ప్రపంచబ్యాంక్‌లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు లోకేష్. ఆఫ్రికా దేశం ఇధియోపియాలో ఇ_గవర్నెన్స్ ప్రాజెక్టుని విజయవంతంగా అమలు చేయడం, దక్షిణాఫ్రికా, సూడాన్ ప్రభుత్వరంగ పరిశ్రమల్లో ఇ_గవర్నెన్స్ వెలుగుల్ని విరజిమ్మడం అతని వ్యక్తిగత విజయమే. అలాగే తన సొంత కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ గ్రూపుకి 2008లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. హెరిటేజ్‌ని శ్రీమతి భువనేశ్వరి నిర్వహిస్తున్నారు. 2008లో హెరిటేజ్ లాభాలు కేవలం రూ.630 కోట్లు కాగా, లోకేష్ అడుగుపెట్టాక, 2013లో అంటే అయిదేళ్లలోనే లాభాలు రూ.1600 కోట్లకు పెరిగాయి. ఇది అతని దక్షతకు ఒక గీటురాయి.

రాజకీయ అరంగేట్రం

2004- 2014_ఈ పదేళ్లలో కేంద్రంలో యు.పి.ఎ. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ దిక్కుమాలిన పరిపాలన_పెట్టుబడుల వెనకడుగు, చతికిలబడ్డ ప్రాజెక్టులు, నిరుద్యోగుల నిరాశ_చెంచాగాళ్ళ చప్రాసీల నుంచి వేలకోట్ల రాజకీయ దొంగ పెట్టుబడుల దాకా అవినీతి అన్ని రంగాల్లో తిప్పతీగలాగా అల్లుకు పోయింది. విభజన అంచున రాష్ర్ట ప్రజలు కొట్టుమిట్టాడుతున్న సంక్షోభిత వేళలో నారా లోకేష్ రాజకీయ రంగప్రవేశం జరిగింది. ఎప్పటుంచో రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా ఉంది, రోజూ పార్టీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తూనే ఉండేవారు లోకేష్. అయితే, 2013 నుంచి, కంపెనీ వ్యవహారాల్లోంచి పూర్తిగా తప్పుకొని, అప్పటి నుంచి మొత్తం పార్టీకే అంకితమయ్యారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి, ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ప్రతిపక్షాన్ని చావు దెబ్బ తీయాలని కాంగ్రెస్ సకల ప్రయత్నాలూ చేసింది. పాలక పార్టీ ఎన్ని మాయా పాచికలు వేసినా రాష్ర్టంలోని మూడు ప్రాంతాల్లోనూ గట్టి పార్టీ నిర్ణయాలూ, సుశిక్షితులైన కార్యకర్తలూ, చెక్కుచెదరని వాళ్ళ అంకిత భావమూ అండగా తెలుగుదేశం తెగించి పోరాడి నిలబడింది. 2013 రానే వచ్చింది. పులిమీద పుట్రలాగా అటు తెలంగాణా, ఇటు ఎన్నికలు వచ్చిపడుతున్నాయి. పార్టీకి పరీక్షా సమయం. సంక్షోభం పార్టీ తలుపుతడుతోంది. ఇప్పడు ఎగిరి దూకకపోతే, ఇంకెప్పడూ తిరిగి లేవలేం- అనే అగ్ని పరీక్షా సమయంలో లోకేష్ మరింత చైతన్యంలో, మరింత చురుగ్గా కదిలి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచాడు. చంద్రబాబు ఎత్తుగడలకు కొత్తవూపుగా, తండ్రి వ్యూహానికి వెన్నుదన్నుగా, చరిత్రాత్మక పాదయాత్రకు ఉడతా భక్తిగా లోకేష్ శభాష్ అనదగ్గ పాత్ర పోషించాడు. మేనిఫెస్టో రూపకల్పన, సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేల నిర్వహణ, ప్రచారం వంటి ఎన్నో కీలకమైన బాధ్యతలు ఆయనే స్వయంగా చూసుకున్నాడు. పది సంవత్సరాల తర్వాత తిరిగి పార్టీ అధికారంలోకి రావడానికి తెరవెనక అసమానమైన ఆలోచన, జనంలో అనితర సాధ్యమైన ఆచరణ- చేసి చూపించి తండ్రి మొహంలో చిరునవ్వులు పూయించిన మంచి కొడుకు లోకేష్.

ఆసక్తులు … అభిరుచులు

ఈ కొత్త నాయకుడికి భేషజం లేదు. పటాటోపమూ లేదు. మాటల గారడీ లేదు. నమ్రత, పనిపట్ల విధేయత, జనం కోసమే పనిచేయాలన్న ఒక నిబద్ధత. ఆరోగ్యం అంటే అతనికెంతో జాగ్రత్త. సైక్లింగ్, స్విమ్మింగ్ శ్రద్దగా చేస్తాడు. మీడియా, చిత్రనిర్మాణం, వ్యాపార రంగాలంటే చాలా యిష్టం. సంస్థల, వ్యవస్థల నిర్మాణం అంటే మంచి ఆసక్తి.